ముంబై టెర్రరిస్టు దాడుల్లో పాల్గొని దొరికిపోయిన అజ్మల్ కసబ్ భద్రత కోసం ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు 10.87 కోట్ల రూపాయలని తేలింది. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐ.టి.బి.పి) విభాగం అజ్మల్ కసబ్ కి సెక్యూరిటీ అందిస్తున్నందుకు ఇప్పటివరకూ ఖర్చయిన రు. 10.87 కోట్లను తమకు తిరిగి చెల్లించాలని బిల్లు పంపడంతో మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం షాక్‌కి గురైంది. ఐటిబిపి డైరెక్టర్ జనరల్ ఆర్.కె.భాటియా ఈ బిల్లును పంపాడు. మార్చి 28, 2009 నుండి సెప్టెంబరు 30, 2010 వరకు కసబ్ కి రక్షణ సమకూర్చినందుకు ఈ మొత్తం తమకు చెల్లించాలని ఆయన కోరుతున్నాడు. 200 మంది ఐ.టి.బి.పి పోలీసులు రోజుకి 24 గంటలపాటు కసబ్ కి సెక్యూరిటీగా ఉంటున్నారు. వీరు అత్యాధునికమైన ఆయుధాలతో కసబ్ కి కాపలా కాస్తున్నారు.
అయితే మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కసబ్ సెక్యూరిటీ ఖర్చు తిరిగి చెల్లించమనడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. హోమ్ సెక్రటరీ కసబ్ ఖర్చు కేవలం తమ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదని చెబుతూ ఐ.టి.బి.పి కి లేఖ రాస్తామని తెలిపారు. “అని హోమ్ సెక్రటరీ26/11 టెర్రరిస్టు దాడులు కేవల మహారాష్ట్ర వరకే పరిమితమైన అంశం కాదు. అది దేశం మొత్తానికి సంబంధించిన సమస్య” మేధా గాడ్గిల్ తెలిపింది. ఆ విషయం చెబుతూ లేఖ రాస్తున్నామని ఆమె తెలిపింది. “కసబ్, అతని మిత్రులు చేసిన దాడి కేవలం ముంబై నగరం మీద మాత్రమే జరిగిన దాడి అని భావించడం పొరబాటు. అది భారత దేశం పైనే జరిగిన దాడి. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే బిల్లు చెల్లించాలనడం సహేతుకం కాదు” అని ఆమె పేర్కొన్నారు.
అజ్మల్ కసబ్ రక్షణ నిమిత్తం అంత ఖర్చు పెట్టడం పట్ల చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసలు అతన్ని ఉరి తీయకుండా ఇంతకాలం కాపాడాలా? అని ప్రశ్నిస్తున్నవారు లేకపోలేదు. ఇంతకాలం ఉరి తీయకుండా ఉండడం భారత ప్రభుత్వ వైఫల్యంగా తిట్టిపోస్తున్నవారూ లేకపోలేదు. అటువంటి భావన సరైనదేనా అని చర్చించుకోవడం అవసరం. మహారాష్ట్ర హోం సెక్రటరీ అన్నట్లు ఈ దాడి భారత దేశ సార్వభౌమత్వం మీద జరిగిన దాడి. డేవిడ్ హేడ్లీ అమెరికా లోని చికాగో కోర్టులో ఇస్తున్న సాక్ష్యాన్ని పరిశీలిస్తే పాకిస్ధాన్ గూఢచార సంస్ధ ఐ.ఎస్.ఐ ఈ దాడులకోసం ఎటువంటి పధకం రూపొందించిందీ, రెండు సంవత్సరాల పాటు ఈ దాడులకోసం ఎలా ఏర్పాట్లు చేసిందీ, ఎంత జాగ్రత్తగా పధకం పన్నిందీ హేడ్లీ వివరిస్తున్నాడు. డేవిడ్ హేడ్లీని విచారించకుండా లాడెన్ ని చంపినట్లు చంపేస్తే ఆ వివరాలన్నీ బైటికి వచ్చి ఉండేవి కావు.
భారత దేశ రక్షణ కోణంలో చూస్తే దాడి నిమిత్తం ఓ పది మంది టెర్రరిస్టులు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముంబై లోని ప్రధాన ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించగలిగారంటే ఆ పని ఎలా చేయగలిగారో వివరాలు ప్రజలకీ ప్రభుత్వానికి తెలియాలి. ప్రభుత్వం ప్రజల రక్షణ ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉన్నాయో లేదో ఈ అంశం ఎత్తి చూపింది. ఏ ఏ మార్గాల ద్వారా వారు భారత దేశ భూభాగాన్ని చేరుకుందీ, మన రక్షణ ఏర్పాట్లలోని లొసుగులన్నీ విచారణలోనే తేలే అంశాలు. ఒక్కసారిగా నిందితుల్ని విచారణ లేకుండా చంపేస్తే ఈ వివరాలు తెలిసే అవకాశం లేదు. మరోసారి అటువంటి దాడి జరగకుండా మన లొసుగులను పూడ్చుకోవలసిన అగత్యం మనకు తెలిసేదే కాదు. ఎక్కడ లొసుగులున్నదీ, అవి పూడ్చుకునే మార్గాలు, రక్షణకు సంబంధించి దేశ రక్షణ బలగాల దృష్టికి రాకుండా మిగిలిపోయిన వివిధ కోణాలు విచారణ ద్వారానే తెలుస్తాయి. పధకం పన్నిన తీరు, అమలు జరిపిన తీరు, బలహీనతలను వినియోగించుకున్న తీరు ఇవన్నీ తెలియాలంటే విచారణ అనవసరం.
అంతే కాదు. కసబ్ రక్షణ కేవలం కసబ్ ప్రాణాల రక్షణ కోసమేనా? కాదని గమనించాలి. కసబ్, అతని మిత్రుల టెర్రరిస్టు చర్యవలన 166 మంది భారతీయులు, భారత దేశ అతిధులు చనిపోయారు. వారు చనిపోయి భారత దేశ ప్రభుత్వ భాధ్యతలను, భారత ప్రభుత్వం పట్ల ప్రజల ఆలోచనా దృక్పధాన్నీ ఒక్క సారి గుర్తు చేసి చనిపోయారు. తమలాగా మరికొందరు బలికాగూడదని గుర్తు చేస్తూ చనిపోయారు. వారి స్మృతులు ప్రభుత్వం, ప్రజల భాద్యతలను నిరంతరం గుర్తు చేయాలి. భారత ప్రజల రక్షణకు ప్రభుత్వం ఏ మేరకు సిద్ధమై ఉన్నదో ఎత్తి చూపుతూ వారు చనిపోయారు. అటువంటి వారి మృతికి కారణభూతమైన వారి ప్రతినిధిగా మిగిలన ఏకైక వ్యక్తి కసబ్. అతని ద్వారా మనకు మన దేశ రక్షణ అంశాలు, రక్షణలోని లొసుగుల అంశాలు, ఆ లొసుగులను పూడ్చుకోవలసిన భాద్యతలు, మరోసారి జరక్కుండా ఉండటానికి పాటించాల్సిన అదనపు ఏర్పాట్లు మనకు తెలిసి రావడానికి కసబ్ విచారణ పూర్తిగా జరగాలి.
కానీ హేడ్లీ విచారణనూ, కసబ్ విచారణనూ పోల్చి చూస్తే హస్తి మశకాంతరం ఉన్నట్లు కనిపిస్తుంది. హేడ్లీ విచారణలో అనేక విషయాలు, రక్షణకు సంబంధించిన చాలా అరుదైన విషయాలు, టెర్రరిస్టులు మతానికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ఎలా exploit చేసిందీ తెలుస్తున్నది. బహుశా డేవిడ్ కోల్‌మెన్ హేడ్లీ తాను చేసిన నేరాలను అంగీకరించినందువలన ఈ తేడా వచ్చిందేమో! అయినా కసబ్ విచారణ ద్వారా కోర్టులు, లాయర్లు భారత ప్రజలకు తెలియ జెప్పాల్సిన అంశాలను వెలికి తీయడంలో వైఫల్యం కనిపిస్తూనే ఉంది. భారత దేశ న్యాయవ్యవస్ధ సైతం ఎంత గుడ్డిగా విచారణ తంతుని నిర్వహిస్తున్నదీ కూడా ఈ సందర్భంగా తెలిసి వస్తున్నది. భారత పాలకులు ఈ అంశాలను గమనిస్తున్నదీ లేనిదీ తెలియదు. కాని గమనించి సరిదిద్దు కోవలసిన అగత్యమైతే దండి గా కనిపిస్తోంది. కేవలం డబ్బులిచ్చి ప్రజల ఓట్లు పొంది అధికారం పొందాక ప్రజలకు సంబంధించిన అన్ని అంశాలను విస్మరిస్తున్న సంగతి ముంబై టెర్రరిస్టు దాడులు, కసబ్ విచారణకూ హేడ్లీ విచారణకూ ఉన్న అంతరం ద్వారా ద్యోతకమవుతున్నది.
ప్రజల పట్ల నిర్లక్ష్య భావనకు ఇది దర్పణం. అధికారం లో కొచ్చి ఏదో విధంగా సంపాదించి దేశం బైటికి తరలించడం పైనే మన పాలకుల దృష్టి కేంద్రీకృతమైనదని కసబ్ ఉదాహరణ ద్వారా రుజువైంది. కసబ్ ని మన ప్రభుత్వం ఉరితీయలేదే అని దూషిస్తున్న వారు అదే ప్రభుత్వం నిర్లక్ష్యాన్నీ, ప్రజల పట్ల అగౌరవాన్నీ, ప్రజలప్రయోజనాలను కాపాడలేని తనాన్నీ మొదట ప్రశ్నించాలి. ప్రజల కోసం ఆలోచన చేయనట్లయితే అధికారం ఇక మీకిచ్చేది లేదు అని చెప్పగలగాలి. అందుకు మార్గాన్ని అన్వేషించాలి. కసబ్, అతని బృందం చేసిన దాడికి ముందు అనేక దాడులు జరిగాయి. అన్ని దాడులు జరిగినా లొసుగులతోనే భారత దేశ రక్షణ కొనసాగడానికి కారణం మన పాలకులేనని గ్రహించి మరోసారి ఓటు వేసే ముందు గుడ్డి అభిమానం కాకుండా విచక్షణతో ఓటు వేయాల్సిన అవసరాన్ని గుర్తించాలి. ఓటు వేసేందుకు ఎవరూ అర్హులు కానట్లయితే ఖాలీ బ్యాలెట్ ని ఇవ్వడానికి కూడా సిద్ధం కావాలి.
No comments:
Post a Comment